నియంత్రిత వ్యవసాయ సాగు విధానం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించొచ్చని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై అవగాహన కల్పించారు. శ్రీరాంసాగర్ నుంచి మంచిప్ప ద్వారా ప్యాకేజీ 22 ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తేవాలన్న సంకల్పంతో... సీఎం రైతుబంధు ప్రారంభించారని అన్నారు.
రూ.12 వందల కోట్ల రైతు రుణమాఫీ
లాక్డౌన్ ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.12 వందల కోట్ల రైతు రుణమాఫీ చేశామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయించామన్నారు. మూడు సంవత్సరాల కాలంలో 600 మీటర్ల ఎత్తుకు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడా 100% ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇకపై మూడు నెలల ముందే ఏ పంట వేయాలనే వివరాలతో రైతులకు వ్యవసాయ కార్డులు ఇస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ