తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులతో మాట్లాడేందుకు సిద్ధమే: కామారెడ్డి కలెక్టర్ - Kamareddy Municipal Master Plan Issue

Collector Jitesh Patil comments about Kamareddy Municipal Master Plan Issue
రైతులతో మాట్లాడేందుకు సిద్ధమే: కామారెడ్డి కలెక్టర్

By

Published : Jan 5, 2023, 7:31 PM IST

Updated : Jan 5, 2023, 7:54 PM IST

19:29 January 05

మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల్లో కొందరు భయం సృష్టించారు: కలెక్టర్‌

కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌పై.. రైతుల ఆందోళనలు మిన్నంటాయి. అయితే దీనిపై కలెక్టర్ జితేశ్‌ పాటిల్‌ స్పందించారు. రైతులతో మాట్లాడేందుకు సిద్ధమేనని కామారెడ్డి కలెక్టర్ జితేశ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. రైతుల ప్రతినిధులు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. రైతులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని అన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

రైతుల తరఫున 10 మంది వచ్చి వినతిపత్రం ఇవ్వవచ్చు. మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల్లో కొందరు భయం సృష్టించారు. ఇండస్ట్రియల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇంకా ముసాయిదా దశలోనే ఉంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ ధర్నాను విరమించుకోవాలి. అభ్యంతరాలు ఏమైనా ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వండి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. - కలెక్టర్ జితేశ్‌ పాటిల్‌

బుధవారం రైతు ఆత్మహత్యతో నిరసనలు మరింత రాజుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రైతులు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. వారికి భారతీయ జనతా పార్టీ సైతం మద్దతు పలికింది. కుటుంబాలతో కలిసి సీఎస్‌ఐ మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట.. ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. నిరసనల్లో పాల్గొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు రైతులు యత్నించారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు... ఆందోళనలు, నిరసనలతో.. కలెక్టర్‌ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది.

ఉదయం నుంచి రైతుల వెంటనే ఉన్న రఘునందన్‌రావు... వారితోనే కలిసి భోజనం చేశారు. కలెక్టర్‌ బయటకు వచ్చి.. వినతిపత్రం తీసుకునే వరకు.. ఆందోళనలు విరమించమన్నారు. రైతుల ధర్నాలో పాల్గొనేందుకు... రామారెడ్డి వరకు వచ్చిన ఎంపీ అర్వింద్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jan 5, 2023, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details