Clash between BRS BJP leaders: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభసగా ముగిసింది. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నప్పుడు స్టేజ్‌పై ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన బీజేపీ ఎంపీటీసీ మహిపాల్ యాదవ్ కూర్చోవడంతో వివాదం మొదలైంది. ప్రొటోకాల్ ప్రకారం స్టేజ్ పైన కూర్చోవడానికి ఆయనకు అర్హత లేదంటూ అధికార పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అక్కడే స్టేజ్‌పై ఉన్న ఎంపీపీ అనసూయ స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీలు.. ఎంపీటీసీ మహిపాల్ యాదవ్‌ను బయటకు వెళ్లాలని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుందో తనకు చూపించాలని అధికార పార్టీ నాయకులను, అధికారులను మహిపాల్ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీటీసీపై బూతు పురాణాలు తిడుతూ ఇక్కడి నుంచి బయటకు వెళ్లకపోకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయంటూ.. ఎంపీపీ అసహనం వ్యక్తం చేశారు.
పోలీసుల రంగ ప్రవేశంతో..: విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గని నేతలు.. పోలీసుల సమక్షంలోనే మహిపాల్ యాదవ్‌పై దురుసుగా ప్రవర్తించారు. దీంతో అధికార పార్టీ నాయకులపై మహిపాల్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు మహిపాల్ యాదవ్ మండల పరిషత్ హాల్ నుంచి బయటకు పంపించారు. అనంతరం అక్కడి నుంచి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు.
విలేకరులపై ఎంపీపీ భర్త వీరంగం: ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న విలేకరులపై ఎంపీపీ అనసూయ భర్త రమేశ్ కూడా దురుసుగా ప్రవర్తించారు. 'మీకు ఏ అధికారం ఉంది.. ఐడీ కార్డులు ఏవీ..? మిమ్మల్ని లోపలికి ఎవరు రమ్మన్నారు' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ఐడీ కార్డులు చూపించిన.. వారిపై దుర్భాషలాడారు. వారి సెల్ ఫోన్‌లు లాక్కొనే ప్రయత్నం చేశారు.
సుమారు అరగంట పాటు మండల పరిషత్ కార్యాలయంలో ఈ గొడవ జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అధికారులు, స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాయకులే ఇలా కుర్చీలు కోసం అధికార హోదా కోసం గొడవ పడటం చూసి అవాక్కయ్యారు. ఇదంతా చూస్తున్న స్థానిక ఎంపీడీవో మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించారు.