రేషన్ బియ్యం అక్రమాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు తీసుకోకుండా మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి లెక్కచెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కొందరు రేషన్ డీలర్లు మరో అడుగు ముందుకేసి కొత్త దందాకు తెరలేపారు. ఇతర జిల్లాలకు చెందిన రేషన్ డీలర్లతో కుమ్మక్కై అక్కడి లబ్ధిదారుల బియ్యంవారికి తెలియకుండా రెవెన్యూసిబ్బంది సహకారంతో సొమ్ము చేసుకున్నారు. లబ్ధిదారుల ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులు నిజాలను నిగ్గుతేల్చారు.
పేదల బియ్యం.. అక్రమార్కుల పరం
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. లబ్ధిదారులు ఎక్కడున్నా ఆప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు పోర్టబులిటీ తీసుకొచ్చింది. బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు వేస్తే కరోనా వచ్చే అవకాశం ఉందని థర్డ్‌పార్టీ వేలి ముద్రలతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీఆర్వో, వీఆర్ఏలు వేలి ముద్రలు వేసి లబ్ధిదారులకు బియ్యం అందేలా ఆదేశాలిచ్చారు. ఈ అవకాశాన్ని కొందరు అక్రమాలకు కేంద్రంగా మార్చారు. మహబూబాబాద్ డీలర్లు తమ పరిధిలో రేషన్ తీసుకోని వారి జాబితాను కామారెడ్డి డీలర్లకు పంపారు. జాబితా ప్రకారం రేషన్ పోర్టబులిటీ కింద బియ్యం తీసుకుని నల్లబజారులో విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
173 క్వింటాళ్ల బియ్యం పందికొక్కుల పాలు