కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దోమకొండలో ముగ్గుర్ని కిరాతకంగా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఓ ఉన్మాది. శనివారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. మృతుల వివరాల గురించి ఆరా తీశారు. మృతులు బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బందెల బాలయ్య, ఆయన కూతురు లత, తమ్ముడు రవి కుమార్తె చందనలుగా గుర్తించారు.
ప్రేమ వివాహం చేసుకుందని...
బందెల బాలయ్య, బందెల రవి అన్నదమ్ములు. గ్రామంలో కూలీపనులు చేసుకొంటూ జీవిస్తున్నారు. ఇటీవల బాలయ్య పెద్ద కుమార్తె దీప అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. తన భార్య తరఫు బంధువుల అబ్బాయిని దీప ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని రవి జీర్ణించుకోలేకపోయాడు. వారి ముందు విలువ తగ్గుతుందని కుటుంబసభ్యులతో గొడవ పడగా.. కులపెద్దలు రవిని సముదాయించారు. కానీ రవి పగ మాత్రం చల్లారలేదు. అన్న రెండో కుమార్తె లత, తన కుమార్తె చందనను మట్టుబెట్టాలని దురాలోచన చేశాడు. ప్రేమ వివాహాన్ని అడ్డుకోని అన్ననూ కడతేర్చాడు.