తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi sanjay: 'తెరాస, భాజపా కలిసి ఉంటే మేమెందుకు పోటీచేస్తాం' - నాగిరెడ్డిపేటలో బండి సంజయ్​ మీడియా సమావేశం

గత ఏడేళ్లలో పన్నుల వాటా, అనేక పథకాల కింది రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.2లక్షల 52వేల కోట్లు చెల్లించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు... కేసీఆర్​తో సహా వెళ్లి వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సిద్ధమని ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న ఆయన... నాగిరెడ్డిపేట్​ మండలం బంజారాలో మీడియా సమావేశం నిర్వహించారు.

bandi
bandi

By

Published : Sep 16, 2021, 1:14 PM IST

తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు చెల్లిస్తే... కేంద్రం రూ.1.46 లక్షల కోట్లు మాత్రమే చెల్లిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోందని.. ఇది తప్పయితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం బంజారాలో జరిగిన మీడియా సమావేశంలో... కేంద్రం గత ఏడేళ్లుగా ఇచ్చిన నిధుల వివరాలను వివరించారు.

జీతాలు ఇవ్వలేని స్థితిలో...

రాష్ట్ర ప్రభుత్వం కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందని బండి సంజయ్​ విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ కుటుంబం ఆదాయం మాత్రమే పెరుగుతుందని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.2.72 లక్షల కోట్లు తీసుకుని... రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నారన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్​ విమర్శించారు.

మోదీలో సర్దార్​పటేల్​.. కేసీఆర్​లో నయా నిజాం..

మోదీని చూస్తే సర్దార్ పటేల్, కేసీఆర్​ను చూస్తే నయా నిజాం కనిపిస్తున్నట్లు ప్రజలు అంటున్నారని బండి సంజయ్​ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం రూ.1.22లక్షల కోట్లు, రూ.1.4లక్షల కోట్లు పన్నుల వాటాగా రాష్ట్రానికి ఇచ్చామని వెల్లడించారు. వాటితో పాటు జాతీయ రహదారుల కోసం రూ.40వేల కోట్లు మంజూరు చేసి.... రూ.21వేల కోట్లు విడుదల చేసిందని స్పష్టం చేశారు. రైల్వే బడ్జెట్ కొత్త కేటాయింపు రూ. 23వేల కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

అప్పుడెందుకు అడగలేదు..

ఎలాంటి ఆపద వచ్చినా కేంద్రమే ఆదుకోవాల్సి ఉంటుందని... కొవిడ్​ వ్యాక్సిన్ కూడా అందులో భాగమేనని సంజయ్​ అన్నారు. ఇవన్నీ కేంద్రం ఇవ్వనప్పుడు పార్లమెంట్​లో ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. దిల్లీ వెళ్లిన కేసీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ఎందుకు కలవలేకపోయారని... కొవిడ్​ వల్ల దెబ్బతిన్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు కేసీఆర్ ఒక్క పైసా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. కనీసం వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా కేసీఆర్ ప్రజలకు చెప్పడం లేదని విమర్శించారు.

సీఎం సవాలునే స్వీకరిస్తా..

పనుల్లో వాటా యూపీఏ ప్రభుత్వంలో 32శాతం మాత్రమే ఉండేదని... దానిని ఇప్పుడు 41శాతానికి పెంచామన్నారు. తెలంగాణలో 90శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని... 30శాతం మంది ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. పాలనపై ప్రజల దృష్టి పడకుండా.. ఉప ఎన్నికలు కోరుకునే వ్యక్తి సీఎం కేసీఆర్... అని దుయ్యబట్టారు. అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్​తో దిల్లీ వెళ్లేందుకు సిద్ధమని గతంలోనే చెప్పానన్నారు. రైతుబంధు ఇచ్చి ఇతర వ్యవసాయ సబ్సిడీలన్నింటినీ బంద్ చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి మాట్లాడితేనే తాను సవాల్ స్వీకరిస్తానని... భాజపా, తెరాస కలిసి ఉంటే మెమెందుకు పోటీ చేస్తామన్నారు.

ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు..

పాలమూరు జిల్లాలో భాజపా కార్యకర్త మహేశ్​పై నిమజ్జన గొడవలో గ్రామ సర్పంచ్, మరో 15మంది కలసి కంకర రాళ్లతో కొట్టి చంపారని బండి సంజయ్​ అన్నారు. నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని డీజీపీని ప్రశ్నిస్తున్నామన్నారు.

రేపు విరామం

శుక్రవారం నిర్మల్​లో బహిరంగ సభ ఉన్నందున ప్రజా ఆశీర్వాద యాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చాలా కాలంగా భాజపా డిమాండ్​ చేస్తోంది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు.

ఇదీ చూడండి:Bandi Sanjay Letter to Kcr: 'కేసీఆర్ ప్రభుత్వం ఒక తరాన్ని నాశనం చేసింది'

ABOUT THE AUTHOR

...view details