Betting on Kamareddy Election Results 2023 :రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై బెట్టింగులు ఊపందుకుంటున్నాయి. ఏ నియోజకవర్గమైతే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుందో అలాంటి నియోజకవర్గాలే లక్ష్యంగా బెట్టింగ్ నిర్వాహకులు రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి నియోజకవర్గాల్లో కామారెడ్డి ఒకటి. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి స్థానిక వ్యక్తి వెంకట రమణారెడ్డి అయినందున ఈ నియోజకవర్గంపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. దీంతో కామారెడ్డి ఫలితం(Kamareddy Election Result)పై స్థానికులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Bets On CM KCR Win in Kamareddy: కామారెడ్డి ఫలితంపై నియోజకవర్గం అవతల సైతం బెట్టింగ్ జోరుగా సాగుతోంది. స్థానికంగానే కాకుండా జిల్లాలోని ఓ మండలంలో రూ.లక్షల్లో పందెం పెడుతున్నారు. రాష్ట్ర రాజధానిలోనూ ఇక్కడి ఫలితంపై ఉత్కంఠ నెలకొనడంతో అక్కడా జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలో విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా శ్రమించారు. అయితే నియోజకవర్గంలో గెలిచేది ఎవరనేది నిఘా వర్గాల అంచనాలకు కూడా అందని పరిస్థితి ఏర్పడింది.
Bets On Congress Win in Kamareddy: ఇదే సమయంలో సంక్షేమ పథకాలు, పింఛన్లు వంటి వాటితో అధికార పార్టీ అధినేత కేసీఆర్ విజయ బావుటా ఎగురవేస్తారని కొందరు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, జాతీయ నాయకుల పర్యటన రేవంత్ రెడ్డిని గెలిపిస్తాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి స్థానికతతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సొంతంగా రూపొందించిన ప్రణాళికలే అతడిని గెలిపిస్తాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా స్థానికంగా ఎవరికి వారు తమ అభిప్రాయాలతో జోరుగా బెట్టింగ్లు వేస్తూ(Betting on Kamareddy Winning Leader) ఎవరికి వారే తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.