Bandi Sanjay Sensational Comments on Congress :కాంగ్రెస్ నేతలారా.. గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇస్తారా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విజయ శంఖారావం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా బిచ్కుందకు చేరుకున్న బండి సంజయ్.. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ద్విచక్ర వాహన ర్యాలీగా(Two wheeler Rally) మండలంలోని పత్లాపూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
అనంతరం బిచ్కుంద బస్టాండ్లో ఎన్నికల ప్రచారంలో(Election Campaign) భాగంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మధ్యంతర ఎన్నికలు తథ్యం అన్నారు. సుస్థిర ప్రభుత్వం కావాలంటే డబుల్ ఇంజిన్తోనే సాధ్యం అన్నారు. ముస్లిం ఓట్ల కోసం మతపెద్దలంతా ప్రయత్నిస్తున్నారని.. సాధు సంతువులు, అర్చక సమాజమంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. హిందువులందరినీ ఏకం చేయండి అని కోరారు. జుక్కల్ను చూస్తే దు:ఖమొస్తోందని.. ఇన్నాళ్ల అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో మగ్గిపోయిందని ఆవేదన చెందారు.
రాజకీయ పార్టీలు పక్కన పెడదాం.. రంగు రంగు జెండాలు పక్కన పెడదాం.. కాషాయపు జెండా పట్టుకొని ఈ తెలంగాణలో ఎనభై శాతం ఉన్న హిందూ సమాజం ఒక్కటిగా కలిసి ఇక్కడ ఉన్న రజాకారులను భూస్థాపితం చేద్దాం. లేకుంటే రామరాజ్యం ఏర్పడదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. నేను ఆవేశంతో మాట్లాడటం లేదు.. ఈ గడ్డ కోసం ఆవేదన చెంది మాట్లాడుతున్నాను. -బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి