కామారెడ్డి జిల్లా భాజపా నూతన అధ్యక్షురాలిగా అరుణ తార బాధ్యతలు చేపట్టారు. జిల్లా కేంద్రానికి తొలిసారిగా వచ్చిన ఆమెకు జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. కొత్త బస్టాండ్ వద్ద గల లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షడు బాణాల లక్ష్మారెడ్డికి వీడ్కోలు పలికారు. అనంతరం నూతన భాజపా అధ్యక్షురాలికి కార్యకర్తలు సన్మానం చేశారు.
‘పార్టీ బలోపేతం చేయడానికి పనిచేద్దాం’ - కామారెడ్డి భాజపా అధ్యక్షురాలు
కామారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణ తార నాయకులు, కార్యకర్తలను కోరారు. జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె సర్కారు పనితీరును ఎండగట్టేందుకు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పని చేయాలని అరుణతార కార్యకర్తలను కోరారు. రాష్ట్ర సర్కారు అవలంబిస్తున్న తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. జిల్లాలో నూతన కమిటీలు వేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మర్రి రాంరెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.