Solar Power Village: అదో కుగ్రామం.. మూడేళ్ల క్రితం పంచాయతీగా ఏర్పడింది. అనతి కాలంలోనే సౌర విద్యుదుత్పత్తిలో ఆదర్శంగా నిలుస్తోంది. అదే.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్. గ్రామంలో మొత్తం 70 ఇళ్లున్నాయి. సొంతంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే ఛార్జీల భారం నుంచి ఉపశమనం పొందొచ్చని గ్రామ సర్పంచి రాము ఆలోచించారు. గ్రామస్థులు సభ్యులుగా ఉన్న ‘మన పంచాయతీ’ వాట్సప్ గ్రూపులో ప్రతిపాదించగా సమ్మతించారు.
Solar Power Village: ఆదర్శంగా అంకోల్.. సౌరవెలుగులతో జిగేల్ - Solar Power Village in kamareddy
Solar Power Village: అదో కుగ్రామం.. కానీ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఆ గ్రామస్థులు. సొంతంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి ముందుకొచ్చారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం చొరవతో స్త్రీనిధి సంస్థ నిధులు మంజూరుచేసింది.
టీఎస్ రెడ్కో(తెలంగాణ రాష్ట్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) 40 శాతం రాయితీ కల్పించింది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చొరవతో స్త్రీనిధి సంస్థ రుణాలిచ్చింది. మూడు కిలోవాట్ల యూనిట్‌కు రూ.1.05 లక్షల చొప్పున, రెండు కిలోవాట్లకు రూ.80 వేల చొప్పున మంజూరు చేసింది. మూడు నెలల క్రితం తొలుత 14 మంది స్వశక్తి సంఘాల సభ్యురాళ్ల ఇళ్లపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేశారు. 11 మంది మూడు కిలోవాట్లు, ముగ్గురు రెండు కిలోవాట్ల పలకలు బిగించుకున్నారు. మూడు కిలోవాట్ల యూనిట్ ఏర్పాటుకు ఒక్కొక్కరికి రూ.1.60 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు వ్యయమైంది. గ్రామస్థులు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్‌ను నెట్‌మీటరింగ్ ద్వారా ఎన్‌పీడీసీఎల్ కొనుగోలు చేస్తోంది. ఆరు నెలల పాటు ఉత్పత్తి, వినియోగాలను లెక్కగట్టి.. యూనిట్‌కు రూ.4.60 చొప్పున చెల్లిస్తుంది. రెండో విడతలో మరో 25 మంది ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని.. దశలవారీగా అన్ని ఇళ్లలో అమలయ్యేలా కృషి చేస్తున్నట్లు సర్పంచి రాము తెలిపారు.
ఇదీచూడండి:Telangana Night Curfew: నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో సర్కార్!