ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ వేదికను జడ్పీటీసీలు, ఎంపీపీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ కె.సరిత అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా పరిషత్ ఛైర్మన్ కార్యాలయంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముందు జడ్పీ ఛైర్మన్ సరిత కార్యాలయ ఆవరణలో మూడు మెుక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి మెుక్కలు నాటామని సరిత తెలిపారు. ఈ సందర్భంగా తాను జడ్పీటీసీలకు ఈ సవాల్ విసురుతున్నట్లు వెల్లడించారు. హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు, ప్రజలను కోరారు.
జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ ఛైర్మన్ సూచించారు. శాఖా పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మంచి వేదికని అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు.