తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి హామీలు.. ఈ పుష్కరాలకైనా నెరవేరేనా? - ముఖ్యమంత్రి హామీలు

నాలుగేళ్ల కిందట కృష్ణ పుష్కరాల కోసం అలంపూర్​లోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీయార్ అలంపూర్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. కృష్ణా పుష్కరాల్లో ఇచ్చిన వరాలు, ప్రస్తుతం తుంగభద్ర పుష్కరాలు దగ్గర పడుతున్నా అమలుకు నోచుకోలేదు. ఆలయ అభివృద్ధి, వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, మినీ బస్​డిపో, ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు.. ఇలా సీఎం ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోడవం వల్ల నియోజక వర్గ ప్రజలు అభివృద్ధిపై ఆశలు వదులుకున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు తుంగభద్ర పుష్కరాలకైనా నెరవేరేనా అని అడుగుతున్నారు.

whether the cm kcr guarantees are fulfilled in alampur
ముఖ్యమంత్రి హామీలు.. ఈ పుష్కరాలకైనా నెరవేరేనా?

By

Published : Sep 8, 2020, 2:42 PM IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ నియోజక వర్గానికి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీయార్ ఇచ్చిన హామీలు అటకెక్కాయి. నిధులు మంజూరైతే అలంపూర్‌కు సరికొత్త శోభ వస్తుందని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016 ఆగస్టు 11న అలంపూర్‌ మండలం గొందిమళ్ల గ్రామంలో కృష్ణా పుష్కరాలకు వచ్చిన సమయంలో అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి వరాల జల్లులు కురిపించారు. సీఎం పర్యటించి నాలుగేళ్లు అవుతున్నా.. నేటికీ హామీలు కార్యరూపం దాల్చలేదు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పేరొందిన అలంపూర్‌ ప్రాంతాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని చెప్పినా.. నేటికీ అతీ గతీ లేదు.

సౌకర్యాలే సరిగ్గా లేవు..

తెలంగాణలో ఏకైక శక్తిపీఠం జోగుళాంబ ఆలయం. పుష్కరాల తర్వాత ఇప్పటి వరకు ఆలయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. భక్తులొస్తే రాత్రి సమయంలో నిద్రించేందుకు అవస్థలు పడాల్సిందే. ఆలయ ప్రాంగణంలో పచ్చదనం కూడా లేదు. అన్నదాన సత్రం కూడా సరిపోవడం లేదు. చండీహోమం చేసే ప్రాంతం చిన్నగా ఉండటం వల్ల భక్తులకు ఇబ్బందిగా మారింది. వేలసంఖ్యలో భక్తులు, విదేశీయులు ఆలయాలకు వస్తున్నా.. సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఆలయాల అభివృద్ధి కోసం అప్పట్లో రూ.49 కోట్ల ప్రతిపాదనలు తయారు చేసినా.. ఇప్పటి వరకు కదలిక లేదు. బస్సు డిపో లేకపోవడం వల్ల అలంపూర్‌ చౌరస్తాలో బస్సులు రోడ్లపై నిలుపాల్సి వస్తుంది. రాష్ట్ర విభజనకు ముందు బస్సుల సమస్య ఉండేది కాదు. ఇప్పుడు సమయానికి బస్సులు రావడం లేదు. గద్వాల నుంచి అలంపూర్‌కు బస్సులు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మినీ బస్సు డిపో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలంటే దాదాపు 15 కోట్లు నిధులు అవసరమవుతాయి.

డిగ్రీ కళాశాల కావాల్సిందే..

ప్రస్తుతం ఇంటర్ వరకూ అలంపూర్ నియోజక వర్గంలో విద్య అందుబాటులో ఉండగా.. డిగ్రీ కోసం అక్కడి విద్యార్ధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్ధులకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో స్థానికత సమస్య ఎదురవుతోంది. వేలల్లో ఫీజలు చెల్లించి ప్రైవేట్‌ కళాశాలలో చదివే పరిస్థితి లేదు. అలంపూర్​లో కళాశాల ఏర్పాటుకు 3 నుంచి 5 ఎకరాల స్థలం కావాలి. భవన నిర్మాణానికి అన్ని సౌకర్యాలకు దాదాపు రెండున్నర కోట్లు కోట్ల నిధులు అవసరమవుతాయి. ఆ దిశగా సర్కారు చేపట్టిన చర్యలు లేనేలేవు.


వైద్య సదుపాయమేది?
అలంపూర్‌లో వంద పడకల ఆసుపత్రి నియోజక వర్గ ప్రజల చిరకాల వాంఛ. అత్యవసర వైద్యం కావాలంటే ఇప్పుడు కర్నూలుకు పరుగులు పెట్టాల్సిందే. అత్యవసర సేవలకు అంబులెన్స్‌ కూడా లేదు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాధుడు లేడు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రెండేళ్ల కిందట 25 కోట్లు ఖర్చవుతాయని..అధికారుల అంచనా వేసి ప్రతిపాదనలు పంపినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.


ఆయకట్టుకు నీరేది?
ఎన్నికల ముందు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కానీ చివరి ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందడం లేదు. చివరి ఆయకట్టు వరకు నీరందాలంటే మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూర్‌ గ్రామాల వద్ద రిజర్వర్వ్​లు పూర్తి చేయాలి. సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా.. సాగు నీరందడం లేదు. ఆర్డీఎస్‌ కాలువ 71 కిలో మీటరు నుంచి 140 కిలోమీటర్ల వరకు మరమ్మతు పనుల కోసం 61 కోట్లు ప్రతిపాదనలు పంపించినా.. నిధులు మంజూరు కాలేదు. రెండో విడత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు సైతం ముందుకు సాగడం లేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే నెరవేరకపోడవం వల్ల జనం అభివృద్ధిపై ఆశలు వదులుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మరోసారి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

ఇదీ చదవండి:ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ABOUT THE AUTHOR

...view details