కృష్ణా నదిలో ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి పెద్ద ఎత్తున వరద దిగువకు వస్తోంది. శనివారం ఉదయం జూరాలకు 75 వేల క్యూసెక్కులున్న ప్రవాహం రాత్రి తొమ్మిది గంటల సమయానికి 2.10 లక్షలకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 28 గేట్లను ఎత్తి 1.96 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 21,600 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా పెరుగుతూ వస్తోంది. నారాయణపూర్ నుంచి 2.20 లక్షల క్యూసెక్కులు దిగువకు వస్తుండగా ఆలమట్టి నుంచి వదులుతున్న వరదతో ఆదివారం మరింత పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర నదీ పరీవాహకంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలానికి క్రమంగా కృష్ణా నది వరద చేరుకుంటోంది. ఆదివారం నాటికి లక్షన్నర క్యూసెక్కులు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ... కొనసాగుతోన్న గోదావరి జలాల ఎత్తిపోత
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద వస్తోంది. ఆలమట్టి, నారాయణపూర్‌లో ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. తుంగభద్ర నదీ పరీవాహకంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలానికి క్రమంగా కృష్ణా నది వరద చేరుకుంటోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద 10 మోటార్లతో గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగుతోంది.
కాళేశ్వరం లక్ష్మీ పంపుహౌస్ నుంచి కొనసాగుతున్న ఎత్తిపోత
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద 10 మోటార్లతో గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగుతోంది. శనివారం యథాతథంగా వరుస క్రమంలోని మోటార్లను నడిపించి 20 పైపులతో కిలోమీటరు దూరంలోని గ్రావిటీ కాలువలోకి జలాలను ఎత్తిపోశారు. ఈ నెల 5న సాయంత్రం ఎత్తిపోత ప్రారంభం కాగా శనివారం సాయంత్రం 6 గంటల వరకు 72 గంటలపాటు నిర్విరామంగా మోటార్లు నడవగా 4.2 టీఎంసీల జలాలు సరస్వతీ బ్యారేజీకి తరలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మరోవైపు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి శనివారం వరద ప్రవాహం పెరిగింది. మొత్తం 35 గేట్ల ద్వారా మేడిగడ్డ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు.