చదువే పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నాంది. ప్రభుత్వబడుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు పాలకులు పదేపదే చెబుతున్నా... అదే స్థాయిలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని వీరాపురంలో ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఇక్కడ 5నుంచి పదో తరగతి వరకూ 450 మంది విద్యార్దులు చదువుతున్నారు. ఈ నెల 21 నుంచి గురుకులాలు పునఃప్రారంభం కాగా... ప్రస్తుతం 300మంది వరకు తరగతులకు హాజరవుతున్నారు. అద్దె భవనంలో నడిచే ఆ గురుకులంలో ఆరంభం నుంచే ఆగచాట్లు మొదలయ్యాయి.
ప్రశ్నార్థకంగా పారిశుద్ధ్యం
గురుకులంలోని వసతి గదులే.. ఉదయం తరగతి గదులు. వాటినీ క్రమం తప్పకుండా ఊడ్చేదిక్కు లేదు. అక్కడే తినడం, చదువుకోవటం, పడుకోవడం. ఇరుకైన గదుల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. విద్యుత్ సమస్యలతో ఫ్యాన్లు, బోర్లు కాలిపోయాయి. తినేతిండిలో నాణ్యత లోపించగా... కనీసం తాగేందుకు మంచినీరు అందుబాటులో లేని దుస్థితి. గతంలో ఉన్న బోర్లు చెడిపోయాయి. కాలకృత్యాలు సహా ఇతర అవసరాల కోసం బయటి నుంచే నీరు తీసుకొస్తున్నారు.