తుంగభద్ర నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 1 వరకు పుష్కరాలు జరగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తుంగభద్రకు పుష్కరాలు వచ్చాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర నది 65 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. జిల్లాలో నాలుగు చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణిసోంపూర్ లో పుష్కర ఘాట్లలో సౌకర్యాలు కల్పించారు.
శాస్త్రోక్తంగా పూజలు...
అలంపూర్ వద్ద ఘాట్‌లో కీసర పీఠాధిపతి కమలానంద భారతి, తొగుట పీఠాధిపతి మధుసూదనంద స్వామి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై పూజలు చేశారు. తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు చేసి జోగులాంబను దర్శించుకున్నారు.
అన్ని ఏర్పాట్లు...
పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నదిలో ప్రమాదాల బారిన పడకుండా బోట్లను అందుబాటులో ఉంచారు. పుష్కరఘాట్లలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరమైతే ఆదుకునేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.