తుంగభద్ర పుష్కరాల కోసం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్కరాల కోసం రెండున్నర కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. కొవిడ్ దృష్ట్యా ఈసారి నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 70కిలోమీటర్ల మేర తుంగభద్ర నది ప్రవహిస్తున్నా... కొవిడ్ నేపథ్యంలో అలంపూర్, పుల్లూరు, రాజోలి, వేణి సోంపూర్లో మాత్రమే ఘాట్లు ఏర్పాట్లు చేశారు.
వాళ్లకు అనుమతి లేదు
అన్నిఘాట్లు, దేవాలయాల వద్ద పార్కింగ్, క్యూలైన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఆలయ సుందరీకరణ పూర్తయ్యాయి. పుష్కర ఘాట్ల వద్ద వైద్య శిబిరాలు అంటుబాటులో ఉన్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం ఘాట్ల వద్ద ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే పుష్కరాలు నిర్వహించనున్నారు. పిల్లలు, 65 ఏళ్ల పైబడి వృద్ధులు, గర్భిణిలను పుష్కరాలకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.