తెలంగాణ

telangana

ETV Bharat / state

చేతిలో అధికారం ఉందిగా... మట్టిని దోచేద్దాం దర్జాగా

మా చేతుల్లో అధికారం ఉంది. ఎవరూ ఏమీ చేయలేరు అంటూ మట్టిని తవ్వేస్తున్నారు కొందరు వ్యక్తులు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వజ్రాల గుట్టలో రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

అక్రమ తవ్వకాలు

By

Published : Apr 18, 2019, 1:31 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న వజ్రాల గుట్టలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో కొంతమంది మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.

రాత్రి వేళల్లో మట్టి అక్రమ తవ్వకాలు

అధికార పార్టీ అండతోనే

జిల్లాలో గత కొంతకాలంగా కొంత మంది వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో మట్టి తవ్వకాలు స్వేచ్ఛగా సాగిస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 టిప్పర్ల మట్టిని గృహ నిర్మాణాలకు, వెంచర్లకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత సోదరుడు గద్వాల వజ్రాల గుట్టలో ఆర్​ఓబి పనుల కోసం మట్టి తవ్వుకునేందుకు అనుమతులు తీసుకున్నాడు. కానీ తవ్విన మట్టిని ప్రైవేటు ఇళ్ల నిర్మాణానికి అమ్ముకుంటూ.. సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. టిప్పర్ రాకపోకల కోసం వజ్రాల గుట్టకు సమీపంలో ఉన్న జూరాల కాలువను సైతం మూసేసి రహదారిని నిర్మించుకోవడం గమనార్హం. రాజకీయంగా పలుకుబడి ఉండడం వల్ల అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయడం లేదు.

కఠిన చర్యలు తీసుకుంటాం

జిల్లాలో ఒకరికి మాత్రమే మట్టి తవ్వకానికి అనుమతిచ్చామని.. వజ్రాల గుట్టకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మైనింగ్​, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమంగా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారి విజయరామరాజు హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన వారైనా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

రాత్రి వేళల్లో మట్టిని టిప్పర్​లో తరలించడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details