జోగులాంబ గద్వాల జిల్లా ఐదో శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఆలయ సమీపంలో తుంగభద్ర పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు నాలుగో రోజున కార్తిక సోమవారం కావడం వల్ల భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలు వదిలారు. అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. హారతి కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం సతీసమేతంగా హజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అలంపూర్ ఘాట్లో 14,495 మంది, పుల్లూరు ఘాట్లో 2,426 మంది, రాజోలి ఘాట్లో 7,140 మంది, వేణిసోంపురం ఘాట్లో 2,100 మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. పుష్కర ఘాట్లను కలెక్టర్ శృతి ఓజా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.