పన్నెండేళ్ల ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ప్రవేశించే రాశి ఆధారంగా ఒక్కో నదిని ఒక్కో సమయంలో పుష్కరుడు అవహించి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. బృహస్పతి మకర రాశిలో ప్రవేశిస్తున్న సమయంలో అంటే నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు 12 రోజుల పాటు తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్నాయి. తుంగభద్ర నది జోగులాంబ గద్వాల జిల్లాలోనే రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అయిజ మండలం కుటకనూర్, రాజాపూర్, పులికల్, వేణిసోంపురం, రాజోలి మండలం పెద్దధన్వాడ, చిన్నధన్వాడ, తుమ్మిళ్ల, రాజోలి, పడమటి గార్లపాడు, తూర్పు గార్లపాడు, మద్దూరు, కొర్విపాడు, మిన్నపాడు, కలుగొట్ల, పుల్లూరు, ఆలంపూర్, గుందిమళ్ల మీదుగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. నదీ పరివాహకంలోని అన్ని గ్రామాల్లోనూ 2008 పుష్కరాలు ఘనంగా జరిగాయి. కుట్కనూరు, పులికల్లు, వేణి సొంపురం, రాజోలి, పుల్లూరు, అలంపూర్‌లో అప్పట్లో ఘాట్లు ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలు, పితృదేవతల పిండ ప్రదానాలు, ఆలయదర్శనాలకు జనం భారీగా వచ్చారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో 2020లో పుష్కరాల నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది.
3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
పుష్కరాల నిర్వాహణపై ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్గదర్శకాలు, నిధులు విడదల చేయలేదు. దేవాదాయ శాఖ మాత్రం తుంగభద్ర నది పరివాహకంలోని సుమారు 14 ఆలయాల్లో ఆలయ సుందరీకరణ, క్యూలైన్లు, చలువ పందిళ్లు, అన్నప్రసాదాలు, మరమ్మత్తు ఇతర ఏర్పాట్లకు 3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. కొత్త ఘాట్ల నిర్మాణం, ఉన్న ఘాట్ల మరమ్మత్తులు, రోడ్లు, మంచినీరు సహా ఇతర మౌలిక వసతుల కల్పనపై నీటిపారుదల, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా సహా ఇతర ఏ శాఖల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లలేదు. తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం ఎలా నిర్వహించనుందన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.