ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేస్తామన్న సాగునీటి ప్రాజెక్టుల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఒకటి. రూ.783 కోట్ల అంచనా వ్యయంతో తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ కాల్వలకు నీరు ఎత్తిపోయడం.. రెండో దశలో మూడు జలాశయాల నిర్మాణం ఎత్తిపోతల పథకం ప్రణాళిక. తద్వారా రాజోలి బండ డైవర్షన్ స్కీం చివరి ఆయకట్టు వరకూ 55వేల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం.
శిథిలావస్థకు నిర్మాణాలు..
మొదటి దశ పనులు పూర్తయ్యాయి. మూడు మోటార్లు అందుబాటులోకి వచ్చాయి. తుంగభద్ర నదికి వరదలొస్తే నీళ్లు ఎత్తిపోసేందుకు అంతా సిద్ధంగా ఉంది. కానీ చివరి ఆయకట్టుకు నీళ్లందే పరిస్థితి లేదు. 60 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్ కాలువలు నేడు శిథిలావస్థకు చేరుకోవడమే కారణం. ఒక్కో మోటారు ద్వారా 330 క్యూసెక్కుల నీటిని పంపు చేయవచ్చు. కానీ ఆ నీటిని మోసేంత సామర్థ్యం ప్రస్తుత ఆర్డీఎస్ కాల్వలకు లేదు. ప్రధాన కాల్వలు సహా 23 నుంచి 40వ డిస్టిబ్యూటరీ శిథిలావస్థకు చేరుకున్నాయి. పంట కాలువలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువ పూడిక పేరుకుపోయింది. నీటి కోసం రైతులు కరకట్టల్ని తవ్వేయడంతో కట్టలు బలహీనంగా మారాయి.
పెండింగ్‌లో రూ.61 కోట్లు ప్రతిపాదనలు..
తొలిసారిగా తుమ్మిళ్ల ద్వారా నీళ్లు ఎత్తిపోసినప్పుడు ట్రయల్ రన్‌లోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధాన కాల్వలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. మరమ్మతులు, ఆధునికీకరణ కోసం రూ. 61 కోట్ల ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా తుంగభద్రలో నీరున్నా.. సాగునీరందించనలేని దుస్థితి తుమ్మిళ్ల పథకానిది. అలంపూర్ నియోజకవర్గ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద ఆర్టీఎస్ కాలువల పూడికతీత, జంగిల్ కంటింగ్ పనులు అక్కడక్కడా చేపట్టారు. కాలువర మరమ్మతులకు ఉపాధిహామీ పనులు ఉపయోగపడ్డాయి. సుమారు రూ. 1.2 కోట్ల విలువైన పనులు చేసినట్లు అంచనా. కొన్ని చోట్ల ప్రధాన కాలువకు, మరికొన్ని చోట్ల పిల్లకాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు.