తుంగభద్ర పుష్కరాల కోసం సర్వం సన్నద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో... ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలకు పుష్కరాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సైతం హాజరుకానున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా పుష్కరాలకు అంకురార్పణ చేయనున్నారు. పుష్కరాల కోసం జోగులాంబ గద్వాల జిల్లాలో... అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణిసోంపూర్లో ఘాట్లు ఏర్పాటు చేశారు.
రిపోర్ట్ ఉంటేనే..
ఇటీవల వైద్యులు ఇచ్చిన కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ చూపిస్తేనే... ఘాట్లలోకి అనుమతించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రిపోర్టు లేనివారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే ఘాట్, ఆలయాలకు అనుమతించనున్నారు. ఇక ఘాట్ వద్ద స్నానాలు దుస్తులు మార్చుకునే గదులు, మంచినీళ్లు మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించారు. ఆలయాల్లోనూ భౌతికదూరం పాటించేలా క్యూ లైన్లు సిద్ధమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పుష్కరాలు జరగనున్నాయి .