జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సరస్వతి దంపతులు వ్యవసాయ కూలీలు. వీరిద్దరికీ షుగర్ లేదు. అయినా వీరి ముగ్గురు సంతానం ఇదే వ్యాధి బారిన పడి మరణించారు. మొదట సంతానంగా 2005లో కుమార్తె పుట్టింది. షుగర్‌తో ఏడాదిలోగా మరణించింది. 2008లో జన్మించిన కుమారుడు వీరేంద్ర నాలుగేళ్ల వయస్సుండగా.. చక్కెర వ్యాధితో కిడ్నీలు పాడై చనిపోయాడు.
'ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని 'డయాబెటిస్' చిదిమేస్తోంది' - Three children died of diabetes in the same family
పిల్లలు పుట్టారనే సంతోషం.. ఆ తల్లిదండ్రులకు ఎంతోకాలం నిలవడం లేదు. బోసి నవ్వులతో ఆడుకుంటున్న చిన్నారులను చక్కెర వ్యాధి చిదిమేస్తోంది. పుట్టినవారు ఒకరి తర్వాత మరొకరు మృత్యుఒడికి చేరుతుండగా.. వారిని కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు పడ్డ వేదన వర్ణనాతీతం. ఇప్పటి వరకు ముగ్గురు పిల్లలు ఆ వ్యాధికి బలయ్యారు. చివరి కొడుకూ డయాబెటిస్‌తో బాధ పడుతుండటం ఆ కన్నవారిని కలచివేస్తోంది.
2013లో మూడో సంతానంగా రంగస్వామి పుట్టాడు. ఈ బిడ్డా మూడేళ్లకే షుగర్ బారినపడ్డాడు. ఆరేళ్ల తర్వాత వ్యాధి కబళించింది. నాలుగో సంతానంగా భీమరాయుడు 2017లో జన్మించాడు. వయస్సు ఐదేళ్లు. రెండేళ్ల వరకూ బాగానే ఉన్న బాలుడు.. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తుండటంతో గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు షుగర్ ఉన్నట్లు తేల్చారు.
ప్రతి నెలా రూ.5 వేల ఖర్చు..భీమరాయుడి వైద్యానికి ప్రతి నెలా రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. షుగర్ ఏ స్థాయిలో ఉందో తల్లిదండ్రులే రోజూ పరీక్షించి, ఉదయం, సాయంత్రం సూది మందు ఇస్తున్నారు. దీంతో బాలుడి పొట్ట నిండా గాయాలవుతున్నాయి. తమ బిడ్డలను రక్షించుకునేందుకు ఆ దంపతులు ఉన్న అర ఎకరం పొలాన్నీ అమ్ముకున్నారు. ఇప్పటి వరకు రూ.4 లక్షలు ఖర్చు చేశామని.. తమ ఆఖరి బిడ్డను వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు అవసరమైన వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నామని దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుమారుడిని బతికించుకునేందుకు దాతలు సహకరించి ఆదుకోవాలని కోరుతున్నారు.