జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం కుర్తిరావులచెర్వు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మకు మతిస్థిమితం లేదు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. భర్త జమ్మన్నతో కలిసి ఆమె కుమారుల వద్ద ఉండేది. మతిస్థిమితం లేకపోవడం వల్ల తరచూ ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చేది. ఆనంతరం ఇంటినుంచి వెళ్లిన నాగేశ్వరమ్మ తిరిగిరాలేదు. 2019 ఫిబ్రవరిలో ఆమె భర్త మృతి చెందాడు. ఆ తర్వాత తల్లి జాడ కోసం కుమారులు వెతికినా ఫలితం లేకుండాపోయింది.
రెండ్రోజుల క్రితం అసోంలోని ఓ ఆశ్రమంలో భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో నాగేశమ్మ ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఏపీకి చెందిన ఓ జవాన్ ఆమెను గుర్తించి హైదరాబాద్‌లో తెలిసిన వారికి సమాచారమిచ్చారు. వారు పోలీసులకు చెప్పటంతో నాగేశమ్మ కుమారులను పిలిపించి తల్లి గురించి తెలిపారు. పోలీసులు చూపించిన ఫొటోలో తల్లిని గుర్తించిన పెద్ద కుమారుడు వెంకటన్న ఆమె దగ్గరికి వెళ్లారు.