Bandi Sanjay praja sangrama Yatra: జోగులాంబ గద్వాల జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్ ఇటిక్యాల మండలం వేములలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర కొనసాగుతుండగా కొంతమంది మంది తెరాస కార్యకర్తలు పాదయాత్రకు అడ్డు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు తెరాస కార్యకర్తలను చెదరగొట్టారు. వారిని వేరే ప్రదేశానికి తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న తెరాస కార్యకర్తల వైపు భాజపా శ్రేణులు దూసుకెళ్లాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
అప్రమత్తమైన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలగజేసుకొని పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పడంతో పాదయాత్ర తిరిగి కొనసాగింది. ఉద్రిక్తతకు ముందుగా వేములలో ప్రసంగించిన బండి సంజయ్.. రాష్ట్రంలో తెరాస పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ ఇంతవరకూ నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. నీళ్లు, నియామకాల విషయంలో కేసీఆర్ మాట తప్పారన్న బండి సంజయ్... కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నేడు వేముల నుంచి బట్ల దిన్నె, షాబాద్ మీదుగా ఉదండపూర్ వరకు పాదయాత్ర సాగనుంది.