తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం.. అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు - lack of quality in mid day meals

Lack Of Quality in Midday Meals: మధ్యాహ్న భోజనం కోసం సన్నబియ్యం సరఫరా చేయాల్సిన సర్కారీ పాఠశాలలకు నాణ్యత లేని, నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నాయి. దుర్వాసన, పురుగుల బియ్యాన్ని వండటం వల్ల ఆ భోజనం తిని విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. బడులకు సన్నబియ్యం పంపిణీ చేసే స్టాక్​ పాయింట్ల వద్ద పౌరసరఫరాల శాఖ, విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లేమితో సన్నబియ్యానికి బదులు ముక్కిన బియ్యం, పీడీఎస్​ బియ్యం పంపిణీ అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Lack Of Quality in Midday Meals
మధ్యాహ్న భోజన పథకం

By

Published : Mar 12, 2022, 1:13 PM IST

నాసిరకంగా మధ్యాహ్నభోజన పథకం బియ్యం

Lack Of Quality in Midday Meals: జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపూర్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల పది మంది విద్యార్థులు మధ్నాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈనాడు- ఈటీవీ భారత్​ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా... మధ్యాహ్న భోజన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొండాపూర్ పాఠశాలలో నాసిరకం బియ్యంతో చేసిన భోజనం తినడం వల్లే అనారోగ్యానికి గురయ్యామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గద్వాల అభ్యసన ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, బింగిదొడ్డి ఉన్నత పాఠశాలల్లోనూ నాసిరకం బియ్యం వస్తున్నాయి. దుర్వాసన రావడం వల్ల అన్నం తినలేకపోతున్నామనిని పిల్లలు వాపోయారు. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యంలో పురుగులు కనిపించాయి. ఏజెన్సీలు వాటిని ఏరేసి అన్నం వండుతున్నా ఫలితం ఉండటం లేదని తెలిపారు.

ఇంటికి వెళ్లి తింటున్నాం

"మధ్యాహ్న భోజనం తరచుగా వాసన వస్తోంది. ఆ అన్నం తినలేక చాలామంది ఇంటికి వెళ్లి తింటున్నాం. అన్నంలో తెల్ల పరుగులు, వాసన వస్తోంది. ఇంతకుముందు భోజనం ఇక్కడ బాగా ఉండేది. మూడు రోజులుగా పాఠశాలలో భోజనం చేయడం లేదు. మా స్కూల్​కు మంచి బియ్యం పంపించాలని కోరుకుంటున్నాం." -విద్యార్థులు

జోగులాంబ గద్వాల జిల్లాలో చాలా రోజులుగా సన్న బియ్యం స్థానంలో నాసిరకం, నాణ్యత లేని బియ్యం సరఫరా అవవుతున్నట్లుగా తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ ఎమ్​ఎల్​ఎస్​ పాయింట్​ను సందర్శించగా అక్కడా ముక్కిపోయిన బియ్యమే కనిపించాయి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. బియ్యం నాణ్యతపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పురుగులు పోవట్లేదు

"20 క్వింటాళ్ల బియ్యం ముక్కిపోయింది. పాత స్టాక్​ కారణంగా బియ్యంలో పురుగులు వచ్చి తినేటప్పుడు చెడు వాసన వస్తోంది. ఎన్ని సార్లు కడిగినా పురుగులు పోవట్లేదు. అందువల్ల కూరలు కూడా తినట్లేదు. చాలా మంది ఇళ్లకు వెళ్లే తింటున్నారు. పాత బియ్యం స్థానంలో నాణ్యత కలిగిన బియ్యం పంపించాలి." -కృష్ణ, మధ్యాహ్న భోజనం ఇన్​ఛార్జ్

చర్యలు తీసుకుంటాం

460 పాఠశాలల్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి సమస్య వచ్చిందని పౌరసరఫరాలశాఖ డీఎం ప్రసాదరావు తెలిపారు. సమస్య తమ దృష్టికి వచ్చిందని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బియ్యం సరఫరాలో పర్యవేక్షణ కొరవడటం వల్ల సన్నబియ్యం స్థానంలో రేషన్​ సరుకు పంపిస్తున్నారు. మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్దే కొందరు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి:58 ఏళ్లు దాటిన కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాల నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details