జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గోవర్ధన్, స్రవంతిలకు ఆరు నెలల క్రితం పండంటి మగబిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న క్రమంలో చిన్నారికి నలతగా ఉండడంతో వైద్యులకు చూపిస్తే... పిడుగులాంటి వార్త బయటపడింది. చిన్నారి గుండెకు రంధ్రాలు పడ్డాయని నిర్ధరించారు. ఆ సమస్యతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో పడుతున్న బాధను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
చిన్నారికి వైద్యం కోసం చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. కర్నూల్, పుట్టపర్తి, హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రుల్లో చూపించారు. ఇళ్లు కట్టుకుందామని దాచుకున్న డబ్బులు వైద్యం కోసం ఖర్చు చేశారు. తలకుమించిన భారమైనా మరో రెండు లక్షలు అప్పు చేశారు. ఎక్కడ చూపించినా ఆపరేషన్ కచ్చితంగా చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ కోసం సుమారు ఆరు లక్షలు ఖర్చువుతుందని తెలిపారు. నెలలోపు ఆపరేషన్ పూర్తి చేయాలని సూచించారు. కూలీకి వెళ్తే తప్ప పూట గడవని ఆ కుటుంబం... బాబును ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లడిల్లుతోంది. దాతలు ముందుకు వచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఆదుకోండి సారూ..
పుట్టినప్పుడు బాబు కళ్లు తెరిచి లేడు. వైద్యులకు చూపిస్తే గుండె సమస్య ఉందని చెప్పారు. బాబు పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు. తిరుపతి తీసుకెళ్తే హైదరాబాద్కు తీసుకెళ్లమన్నారు. హైదరాబాద్కు వెళ్లి వైద్యులకు చూపించాం. రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి వైద్యం చేయించాం. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేయండి సారూ. ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం సారూ.-ప్రశాంతి, చిన్నారి తల్లి