తెలంగాణ

telangana

ETV Bharat / state

SAND MAFIA: గుట్టలను మాయం చేస్తూ.. కాలువల మట్టిని కాజేస్తూ.. - జోగులాంబ గద్వాల జిల్లాలో కాలువల మట్టిని కాజేస్తున్న అక్రమార్కులు

గద్వాల పట్టణం చుట్టుపక్కల ఉన్న గుట్టలు మాయమవుతున్నాయి. జూరాల, నెట్టెంపాడు కాల్వల నుంచి తవ్విన మట్టికుప్పలు కనుమరుగువుతున్నాయి. నాణ్యమైన మట్టి, మొరం కనిపిస్తే చాలు ట్రాక్టర్లు, టిప్పర్లు గద్దల్లా వాలి.. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని ఎగరేసుకు పోతున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా పోలీసు, రెవిన్యూ, మైనింగ్ అధికారులు నోరు మెదపకపోవడం గమనార్హం.

గుట్టలను మాయం చేస్తూ.. కాలువల మట్టిని కాజేస్తూ..
గుట్టలను మాయం చేస్తూ.. కాలువల మట్టిని కాజేస్తూ..

By

Published : Jun 30, 2021, 12:14 PM IST

Updated : Jun 30, 2021, 1:32 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యంగా గద్వాల పట్టణం చుట్టుపక్కల ఉన్న గుట్టలు, జూరాల, నెట్టెంపాడు కాల్వల నుంచి తవ్విన మట్టిని అక్రమార్కులు దోచేస్తున్నారు. నాణ్యమైన మట్టి, మొరం కనిపిస్తే చాలు... ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వి తీసుకెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా... పోలీసు, రెవిన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం చర్యలకు వెనకాడుతున్నారు. తాజాగా గద్వాల శివారు లత్తీపురం సమీపంలోని చాగరుగుట్టలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని పట్టణానికి తరలిస్తున్నారు. లోడు టిప్పర్​ మట్టికి 8 వేలు, ట్రాక్టర్​కు అయితే 4 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత 6 నెలలుగా మట్టి తవ్వకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 10 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్​లో గద్వాల మండలం కాకులారంలో మట్టి అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అక్రమ రవాణా మరింత విస్తరించడం గమనార్హం. ఇక గద్వాల శివారులోని పిల్లిగండ్ల వద్ద ఉన్న గుట్టలను మరో ముఠా కొల్లగొట్టింది. అదే ముఠా నెట్టెంపాడు కాల్వల నుంచి తీసిన మట్టి రాశుల్ని అక్రమంగా తరలించిందనే ఆరోపణలున్నాయి. ఇలా గద్వాల పట్టణంలో రెండు ముఠాలు.. గుట్టల్ని, కాల్వ నుంచి తీసిన మట్టిని దాదాపుగా కాజేశాయి.

నేతల అండదండలు ఉండటంతోనే ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లు ముట్టజెప్పడం వల్లే అధికారులు చర్యలకు తీసుకోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం ఈ వ్యవహారం తమ దృష్టికి రాలేదని... అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:Tourism: పర్యాటకాన్ని పట్టాలెక్కించేలా కసరత్తు

Last Updated : Jun 30, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details