Revanth Reddy Speech at Gadwal Sabha :జన ప్రవాహాన్ని చూస్తుంటే గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగురేయడం ఖాయమని నిర్ధారణ అయిపోయిందని పీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జరిగిన కేసీఆర్ సభలో.. కాంగ్రెస్ సభలో బైట నిలబడ్డంత జనం కూడా లేరని ఆరోపించారు. గద్వాలలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో(Congress Sabha) పాల్గొన్న రేవంత్.. నడిగడ్డలో వరదలొస్తే ముంపునకు గురైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. నడిగడ్డ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనల వల్లే నడిగడ్డ ప్రజలకు కష్టాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే : కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతానికి కష్టాలు వచ్చాయా అని రేవంత్ ప్రజలను అడిగారు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టుల వల్ల కష్టాలు వచ్చాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే 24 గంటల విద్యుత్ ఉండదని దుష్ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే నామినేషన్లు ఉపసంహరించుకుంటానని సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని.. దానిని అమలు చేసి చూపింది కూడా ఆ పార్టీనే అని స్పష్టం చేశారు. కోటి ఎకరాలకు నీళ్లిచ్చి ఉంటే 18 లక్షల పంపుసెట్లు 25 లక్షలకు ఎలా పెరిగాయని రేవంత్ నిలదీశారు.
నన్ను గెలిపిస్తే కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తా : రేవంత్ రెడ్డి
'కాంగ్రెస్ గతంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది. కాంగ్రెస్ కట్టిన ఏ ప్రాజెక్టుకైనా ఇబ్బందులు వచ్చాయా?. గతంలో పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ఆదుకుంది. బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టింది. 24 గంటల కరెంట్ ఇచ్చామని నిరూపిస్తే మేం నామినేషన్లే వేయం. 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా. తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కోటి ఎకరాలకు నీరిస్తే.. 7 లక్షల పంపు సెట్లు ఎందుకు పెరిగాయి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చూసి బీఆర్‌ఎస్ బెంబేలెత్తిపోతోంది. గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి సరితను గెలిపించాలి.' -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు