రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పుణ్య స్నానాల కోసం నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా 5వ శక్తి పీఠం అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి సమీపంలో పుష్కర ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
అనంతరం స్వామి, అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ అధికారులు.. ఆలయం వద్ద ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రసాదాల తయారీ కోసం ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలను తాజాగా తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ప్రసాదాలలో అతి ముఖ్యమైన లడ్డూ, పులిహోర ప్రసాదాలను తయారు చేస్తున్నారు.
అధిక సంఖ్యలో విక్రయాలు
పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లడ్డూ ప్రసాదం 30 వేలకు పైగా అమ్ముడుపోయింది. పులిహోర 13 వేలకు పైగా అమ్ముడుపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని లడ్డూ తయారీ కేంద్రంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రసాదాన్ని తయారుచేస్తున్నారు.