Pedda Vagu Bridge Works at Ieeja in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా పురపాలికలో ఐజా నుంచి గద్వాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పెద్దవాగు(pedda Vaagu Bridge)పై ఉన్న పురాతన వంతెనను కూల్చివేసి రూ.7 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి మూడు నెలల కింద అధికారులు పనులు ప్రారంభించారు. వంతెన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నా.. ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. కానీ వంతెన నిర్మాణం చేపట్టే సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు(R and B Employee) ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో పురపాలిక ప్రజలతో పాటు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వేసవిలో చేపట్టాల్సిన వంతెన నిర్మాణాన్ని వర్షాకాలంలో నిర్మిస్తున్నందున ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. కర్నూలు, శాంతినగర్, రాయచూరు వైపు నుంచి ఐజకు చేరుకునే ఆర్టీసీ బస్సులు బస్టాండ్ వరకే వచ్చి తిరిగి వెళుతున్నాయి.
Asifabad Bridge Issue : వంతెన లేక నిత్యం వెతలే.. వాగు దాటాలంటే చాలు గుండెల్లో గుబులే!
Passengers Facing Problems in Gadwal : గద్వాల వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్ సమీపం నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు బస్టాండ్ వద్ద దిగి వాగులో నడుచుకుంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆవల వైపు చేరుకుంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ముందస్తు ప్రణాళిక చేపట్టకపోవడంతో ఐజ పురపాలిక కమిషనర్ తాత్కాలిక రహదారి చేపట్టారు.
"బ్రిడ్జి దగ్గర నాది షాపు ఉంది. రోజు ఈ మార్గం ద్వారా వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికే పనులు ప్రారంభించి మూడు నెలలు అవుతోంది. వర్షాల వల్ల మధ్య మధ్యలో పనులు ఆగిపోతున్నాయి. బస్సులు పాత బస్టాండ్ దగ్గర ఆగిపోతున్నాయి. ప్రజలు ఎవరైనా రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ బ్రిడ్జి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."- వెంకటేశ్, స్థానికుడు