తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టాలెక్కుతున్న ఆర్థికవ్యవస్థ - పట్టాలెక్కుతున్న ఆర్థికవ్యవస్థ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాణిజ్యం పట్టాలెక్కుతోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌనుతో నెలన్నర రోజులుగా మూతపడి ఉన్న వివిధ పరిశ్రమలు, దుకాణాలు తెరుచుకొంటున్నాయి. మద్యం అమ్మకాల జోరు పెరిగింది.

jogulamba gadwal district latest news
jogulamba gadwal district latest news

By

Published : May 8, 2020, 12:29 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఆర్థికవ్యవస్థ పట్టాలెక్కుతోంది. లాక్‌డౌనుతో నెలన్నర రోజులుగా మూతపడి ఉన్న వివిధ పరిశ్రమలు, దుకాణాలు తెరుచుకొంటున్నాయి. దుకాణదారులు మద్యం కోసం డిపోల ముందు బారులు తీరుతున్నారు. పాలమూరులోని రెండు డిపోల నుంచి బుధవారం రూ.7.20 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. రెండోరోజైన గురువారం ఏకంగా రూ.17.15 కోట్ల విలువ చేసే మద్యం కోసం డీడీలు కట్టారు.

ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌను సడలింపు అనంతరం బుధవారం తెరుచుకున్న మద్యం దుకాణాల ద్వారా సుమారు రూ.6.50 కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా. సాధారణ రోజుల్లో రూ.4 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. 45 రోజుల తర్వాత ఇచ్చిన సడలింపు కావడం వల్ల సాధారణ రోజుల కంటే సుమారు రూ.2.50 కోట్లు ఎక్కువ వ్యాపారం జరిగింది.

గురువారం ఉదయం, సాయంత్రం సమయాల్లో సైతం పలు దుకాణాల వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఎవరూ బయటకు రాలేదు. మరో రెండు రోజులపాటు మద్యం అమ్మకాలు ఇలాగే భారీగా ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఒక్కరోజే 169 రిజిస్ట్రేషన్లు...

ఉమ్మడి జిల్లాలోని 12 రిజిస్ట్రేషను కార్యాలయాల పరిధిలో గురువారం మొత్తం 169 రిజిస్ట్రేషన్లు జరిగి, ప్రభుత్వానికి రూ.11.23 లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా జడ్చర్లలో 50 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సోమవారం నుంచి మరింత ఊపందుకుంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఈ సారి పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. వీటికి సంబంధించిన డబ్బులు మరో మూడు నాలుగు రోజుల్లో ఖాతాల్లో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు పెద్దఎత్తున జరిగే అవకాశం ఉంది. దీంతో మరో వారం రోజుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

మరోవైపు.. రవాణాశాఖ సేవలు ఇంకా ఊపందుకోలేదు. కేవలం 40 శాతం మందికి మాత్రమే స్లాట్‌ బుకింగుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులతో గురువారం సాయంత్రం ఉన్నతాధికారులు వీసీ నిర్వహించి జిల్లాలో రవాణాశాఖ సేవలపై ఆరా తీశారు.

ప్రత్యేక మార్గదర్శకాలు...

కేంద్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలను ఆరెంజ్‌ జోనులో.. వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాలను గ్రీన్‌ జోను పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పురపాలికల్లో పలు దుకాణాలను సరి, బేసి విధానంలో తెరిచి ఉంచాలి. ఆరెంజ్‌ జోనులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలికల్లో రెడ్‌ జోన్‌ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

అందులో భాగంగా గద్వాల జిల్లాలోని పురపాలికల్లో అన్ని దుకాణాలను తెరిచి ఉంచడానికి వీలు లేదు. నిత్యావసరాల దుకాణాలు ప్రతిరోజు తెరుచుకుంటాయి. నిర్మాణ, వ్యవసాయరంగాల దుకాణాలు సరి - బేసి విధానంలో తెరుస్తారు. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండి, మున్సిపాలిటీల్లో ఇప్పటికీ కంటైనుమెంటు జోన్లు కొనసాగుతుండటంతో పుర అధికారులు ఈ మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లోని పురపాలికల్లో ఆరెంజ్‌ జోను మార్గదర్శకాలు సంపూర్ణంగా అమలవుతాయి. దీంతో వ్యాపారాలు ఊపందుకుంటాయి.

ABOUT THE AUTHOR

...view details