Negligence in Nettempadu Irrigation Project in Jogulamba District : జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టు జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం. 2005లో రూ.1,428 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రారంభమైంది. రాష్ట్రావిర్భావం తర్వాత 2019లో అంచనా వ్యయాన్ని రూ.2,548 కోట్లకు సవరించారు.
2022లో మరోసారి రూ. 2,700 కోట్లకు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు(Government Proposals) పంపారు. ఇప్పటివరకూ రూ. 2,368 కోట్లు ఖర్చు చేశారు. అయినా నిర్ణీత ఆయకట్టు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు 20 టీఎమ్సీల నీరు ఎత్తిపోయడం ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. అందుకోసం మొదటిదశలో గుడెందొడ్డి, రెండోదశలో ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, ర్యాలంపాడు కింద 5 ఆఫ్ లైన్ జలాశయాలు నిర్మించారు.
నెట్టెంపాడు నీరు పారితే.. వలసలుండవు..:గుడెందొడ్డి జలశాయాన్ని నింపి.. ఎడమకాలువ ద్వారా 6వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కాని కుడికాలువ ద్వారా 58వేల ఆయకట్టు ఇప్పటికీ సాగునీరు అందడం లేదు. కారణం కాలువపై కొండపల్లి వద్ద వాగుపై కిలోమీటరు మేర నిర్మించాల్సిన అక్వడక్ట్ నిర్మాణం(Aqueduct Construction) పూర్తి కాకపోవడమే. మొదటి దశలో 99 ఏ,బీ,సీ,డీ,.. 100 ప్యాకేజీలుండగా రెండే పూర్తయ్యాయి. 30కిలోమీటర్ల మేర కాలువలు, వాటిపై 296కుపైగా నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. గుడెందొడ్డి జలాశయం కింద ఆయకట్టు రైతులకు దశాబ్దాలకు సాగునీరు అందని ద్రాక్షగానే మారింది.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని వాగ్దానాలు చేస్తున్న నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పిల్ల కాలువల నిర్మాణాల కోసం మూడు సార్లు సర్వే చేశారు. కానీ ఏం లాభం లేదు. నీరు అందించే పనులు మాత్రం చేయటం లేదు. కేవలం వర్షాధారంగానే పంటలు పండిస్తున్నాం. ఇక్కడ చెరువులు ఏమీ లేవు. బోర్లు ఉన్నా సరే.. దాని నుంచి నీరు కొంచెం మాత్రమే వస్తున్నాయి. - బాధిత రైతులు
పేరుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్నా.. సాగునీరు అందక చాలామంది రైతులు పొలాల్ని పడావు పెడుతున్నారు. కొందరు వర్షాధార పంటలు పండిస్తే, కొందరు బోరుబావులపై ఆధారపడి పంటలు వేస్తున్నారు. వానల్లేకపోతే వేసిన పంటలు సైతం ఎండిపోయే పరిస్థితి. రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం గడుస్తున్నా ఇప్పటికీ సాగునీరు అందకపోవడంపై రైతులు ఆవేదన(Farmers Distress) వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా హామీలిస్తున్నారే తప్ప ప్రాజెక్టు పూర్తిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.