Mother services to disabled son: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన ఐలమ్మకు 25 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టుకతోనే కుమారుడు మానసిక వికలాంగుడిగా, దివ్యాంగుడిగా జన్మించాడు. బిడ్డెలా ఉన్నా కన్న తల్లికి ముద్దే కదా.. అందుకే ఆ స్థితిలో పుట్టిన బిడ్డ ఉన్నా.. భారంగా భావించలేదు. బాధ్యత అనుకొని బరువంతా మీదేసుకుంది. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అయినప్పటికీ బెదరలేదు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. సంపాదన, ఉన్న సొమ్మునంతా అతని వైద్యం కోసం ఖర్చు చేసింది. ఈ క్రమంలో 15 కిందట ఐలమ్మ భర్త చనిపోయాడు. దీంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
పూట గడిచేందుకు కష్టంగా ఉన్నా కూడా.. కుమారుడికి బాగవ్వాలని హైదరాబాద్, చెన్నై, తిరుపతి, విజయవాడ ఇలా పలు నగరాలకు తీసుకెళ్లి వైద్యం చేయించింది. కానీ అతని ఆరోగ్య పరిస్థితి మారలేదు. దీంతో ఇంటి దగ్గరే ఉంచుకుని చంటిబిడ్డకు చేసినట్లుగా సపర్యలు చేస్తోంది. భర్త బతికి ఉన్నప్పడు ఒకరు బిడ్డకు కాపలాగా ఉన్న.. మరొకరు పనికి వెళ్లేవారు. భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొడుకు మెలకువతో ఉన్నంత సేపు కాపలాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవలు చేస్తూ ఇంటిపట్టునే ఉండిపోయింది. స్నానం, భోజనం అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటోంది. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితిలో కూడా కొడుకు లేడు.