MLC Kavitha visit alampur temple on eve of Mahashivratri: అలంపూర్ ఆలయంలో ఎమ్మెల్సీ కవితకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రథమంగా గణపతికి అభిషేకం, స్వామివారికి పంచామృత అభిషేకం, యాగశాలలో రుద్రహోమం, జోగులాంబకు కుంకుమార్చన నిర్వహించారు. పూజారులు ఆలయ విశిష్టత వివరించి తీర్ధప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో ఆమెను సత్కరించి ఆశీర్వచనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాదయాత్ర సమయంలో ఇక్కడి ప్రాంతాన్ని కదిలించారని కవిత అన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నామని పేర్కొన్నారు. అలంపూర్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కవిత హామీ ఇచ్చారు.
"పురపాలిక అభివృద్ధి కోసం రూ.10 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు వెచ్చించాము. ఆలయాల అభివృద్ధికి మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి వాటి గురించే ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యేతో చర్చించాము. తెలంగాణలో జరిగే అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సంక్షేమ పథకాలు కోరుతున్నారు. ఆలయాల సమీపంలో అభివృద్ధి పనులు చేసేందుకు పురావస్తు శాఖ అడ్డుపడుతోంది. పురావస్తు శాఖ అనుమతి లేనిది చిన్నరాయిని, గుప్పెడు మట్టిని తీసుకోలేం పురాతన నిర్మాణాల రక్షణకై వారు మంచి పని చేస్తున్నారు. పురావస్తు నిబంధనలకు లోబడి ఆలయాలను అభివృద్ధి చేయాలన్నది ప్రతిబంధకంగా ఉంది. వారి నిబంధనలను పాటిస్తూనే అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనంతో బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించాలి." - కవిత, ఎమ్మెల్సీ