శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు గద్వాలలో మినీ ట్యాంకుబండ్, పార్కు నిర్మాణం కోసం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐజ పురపాలికలో పనుల విషయంలోనూ ఉత్తర్వులు వచ్చినా సాంకేతిక కారణాలతో కాస్త ఆలస్యమైంది. గద్వాల పురపాలిక సమీపంలోని సంగాల జలాశయాన్ని మినీ ట్యాంకుబండ్‌గా మార్చాల్సి ఉంది. ఇందులో భాగంగా జలాశయం ఆనకట్టపై మట్టిపోసి చదును చేశారు. ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో 8 నెలలుగా అడుగు ముందుకు పడటం లేదు. చెరువుకు ఆనుకుని ఉన్న ప్రదేశంలో పార్కు నిర్మాణానికి ఇప్పటికే పునాది రాయి వేశారు. అక్కడ తమ భూములు ఉన్నాయని కొందరు అభ్యంతరం చెప్పగా పనులు ఆగిపోయాయి.
పార్కు నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రదేశం సమీపంలో తమ భూమి ఉందటూ కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. ఈ కారణంగా పనులు ఆగిపోయాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేచేసి నివేదిక ఇస్తాం. సర్వే పూర్తయితే పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
- ఇంతియాజ్ అహ్మద్, పురపాలిక డీఈ