జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదోరోజు మహాగౌరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ముందుగా స్వామివారిని మంత్రి దర్శించుకొని అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
దైవ దర్శనం...
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దేవీ నవరాత్రుల సమయంలో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాచీనమైన ఆలయాలను దర్శించుకుంటే ప్రశాంతత కలుగుతుందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాల వివరాలు సంబంధిత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడిస్తారని పేర్కొన్నారు.