Minister Jupally Krishna Rao Review with Govt Officials :ప్రజా అభివృద్ధిలో పారదర్శకంగా ప్రజల అకాంక్షలకు అనుగుణంగా జిల్లా అధికారులందరూ సమష్ఠి బాధ్యత వహించి పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్(District Collector) ఆవరణంలోని ఐడీఓసీ సమావేశం హాలు నందు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పారదర్శకంగా, అవినీతి లేకుండా మంచి పరిపాలన అందించాలని కోరారు.
రైతులకు, మహిళలకు సంబంధించి ప్రజా సంక్షేమమే పరమావధిగా అధికారులు పనిచేయాలని కోరారు. ఎక్కువగా ధరణి సమస్యలు పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశించారు. ధాన్యం సేకరణ గురించి ఆరా తీశారు. జూరాల(Jurala Project), నెట్టెంపాడు, ర్యాలంపాడు, ఆర్డీఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతవరకు ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించారు. టూరిజం, మున్సిపల్, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ అధికారులను శాఖల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Minister Jupally Review on Lift Irrigations :గద్వాల జూరాల టూరిజంలో 75 శాతం పనులు పూర్తయ్యాయని, ఇక అలంపూర్లో జోగులాంబ ఆలయంలో ప్రసాద్ పథకం పనులు 70 శాతం పూర్తయినట్టు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ(Health Department) గురించి మంత్రి ఆరా తీయగా జిల్లాలో గద్వాల, అలంపూర్లలోని 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అనంతరం అబ్కారీ శాఖపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్పీ ఛైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ రెడ్డి, ఎమెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, విజయుడు పాల్గొన్నారు.