జూరాల కుడి కాల్వ, ఎడమ కాల్వ పరిధిలో వారం కిందట పనులు మొదలయ్యాయి. ప్రధాన, ఉప కాల్వల్లో జమ్ము తొలగింపు, దెబ్బతిన్న చోట మరమ్మతులు, ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లకు గ్రీసింగ్, తాళ్ల మార్పులు వంటి పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఏప్రిల్‌లో మొదలై జూన్ నెలాఖరులోపే ముగించాలి. కానీ జులైలోనూ పనులు సాగుతున్నాయి. మరో 10 రోజుల్లో జూరాలకు వరద వస్తే పనులన్నీ మధ్యలోనే నిలిపివేయాల్సి ఉంటుంది. దాదాపు రూ. 1.50 కోట్లతో కాల్వల పరిధిలో చేస్తున్న మరమ్మతు పనులు పూర్తికాకుంటే ప్రధాన కాల్వలు, ఉపకాల్వల ద్వారా ఆయకట్టుకు విడుదల చేసే నీరు భారీగా వృథా కానుంది.
తోడిపోత ఒక్కటే కాదు :
నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ఏటా నీటిని తోడిపోసి దాని పరిధిలోని జలాశయాలు నింపుతున్నారు. జలాశయాల తూముల వద్ద గేట్ల నియంత్రణ వ్యవస్థ సక్రమంగా లేదు. ఫలితంగా పంటకాలం పూర్తికాక ముందే జలాశయాల్లో నీరంతా ఖాళీ అవుతోంది. గతేడాది చాలామంది రైతులు నష్టపోయారు. గేట్ల నియంత్రణకు ప్రత్యేక సిబ్బంది లేరు. ఆయకట్టు రైతులు ఇష్టారాజ్యంగా గేట్లను ఎత్తి నీటిని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ర్యాలంపాడు జలాశయం రెండు తూముల వద్ద మోటార్లతో గేట్ల ఆపరేటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. గుడ్డెందొడ్డి జలాశయం వద్ద రెండు కాల్వల తూములకు గేట్లు అమర్చినా ప్రాథమికంగా అవసరమైన హైమాస్ట్ వ్యవస్థనే ఏర్పాటు చేయలేదు.