జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. త్వరలో గద్వాల చేనేత పార్కు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది 18 మంది నేత కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను ప్రదానం చేశారు. కొత్తకోటకు చెందిన కృష్ణయ్య, సిద్దిపేటకు చెందిన గాజుల నారాయణకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయగా.. మిగిలిన 16 మందికి ఆయా జిల్లా కలెక్టర్లు అవార్డులు బహూకరించారు. అవార్డు గ్రహీతలకు మెమోంటో, శాలువ, ప్రశంసాపత్రంతో పాటు 10వేల రూపాయల పారితోషికాన్ని అందజేశారు. 2015లో భారత ప్రభుత్వం ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించగా.. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఈ ఏడాది కొవిడ్-19 కారణంగా జిల్లాల్లోనే అర్హులకు అవార్డులు అందజేసినట్టు మంత్రి తెలిపారు. చేనేత కళాకారుల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాలను కొనసాగిస్తామన్నారు. గద్వాల చేనేత పార్కు కోసం ఇప్పటికే శంఖుస్థాపన చేశామని, త్వరలో పనులు ప్రారంభించి గద్వాల చేనేత కార్మికుల కల నెరవేర్చనున్నట్లు మంత్రి ప్రకటించారు.
భారత దేశ వారసత్వ సంపద అయిన చేనేత రంగాన్ని కాపాడుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నదని మంత్రి తెలిపారు. మొదటిది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కొత్త కొత్త డిజైన్లు మార్కెటింగ్ చేసేందుకు ఒప్పందం కుదిరింది. రెండవది చేనేతలో హానికారకమైన రంగులు వాడకుండా పర్యావరణాన్ని కాపాడడం, అవసరమైన రంగులనే వాడటానికి సిఫారసు చేయడానికి ఐఐసీటీతో ఒప్పందం చేసుకున్నట్టు హ్యాండ్లూమ్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. మహిళలను చేనేత రంగంలో ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై యునెస్కోతో చేసుకున్న ఒప్పందం మూడవది అని ఆయన తెలిపారు.