KRMB Sub Committee Visit: రెండు రోజుల పర్యటనలో భాగంగా జూరాల ప్రాజెక్టుతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం పరిశీలించింది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, కేఆర్ఎంబీ ఎస్ఈ అశోక్ కుమార్ సహా తెలంగాణ ప్రాజెక్టు అధికారులు సీఈ రఘునందన్, ఎస్ఈలు శ్రీనివాసరావు, సత్యశిల సహా పలువురు పర్యటనలో పాల్గొన్నారు.
జూరాలలో ఏర్పాటు చేసిన టెలిమెట్రి స్టేషన్‌ను ఉపసంఘం సభ్యులు పరిశీలించారు. ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తున్న నీటి లెక్కలు, టెలిమెట్రి స్టేషన్లో సరిగ్గా నమోదవుతున్నాయా.. లేదా..? అడిగి తెలుసుకున్నారు. పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గతోందా.? లీకేజీ సమస్యలు, డ్యాం భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. డ్యాంకు వస్తున్న ఇన్ ఫ్లో, బయటకు వెళ్తున్న నీరు, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి వినియోగం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నెట్టెంపాడు మొదటి లిఫ్ట్‌ను ఉపసంఘం సభ్యులు పరిశీలించారు. లిఫ్ట్ నుంచి ఎలాంటి డిశ్చార్జ్ లేకపోయినా టెలిమెట్రి యంత్రాల్లో నమోదవుతోందని బోర్డు సభ్యుల దృష్టికి తీసుకురాగా.. సరిచేస్తామని చెప్పనట్లు అధికారులు వెల్లడించారు.