KCR Praja Ashirvada Sabha in Alampur : ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ముఖ్య నాయకులు క్షణం ఖాళీ లేకుండా ఆయా పార్టీ అభ్యర్థుల్లో కార్యకర్తల్లోనూ జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దీపావళి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మూడోసారి సుడిగాలి పర్యటనలు ప్రారంభించారు. రోజుకు మూడు, నాలుగు బహిరంగ సమావేశాల్లో(KCR Public Meetings) పాల్గొంటున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్(BRS) నాయకులు నిర్వహించే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
KCR Praja Ashirvada Sabha Jogulamba Gadwal: జరిగే ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్(cm kcr) సూచించారు. ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదని తెలిపారు. గతంలో పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలమూరులో వచ్చిన మార్పును ప్రజలు గుర్తించాలని అన్నారు. పాలమూరులో కరవు రాకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా ఎవరూ మాట్లాడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పదవుల మీద ఆశతో ఏం మాట్లాడలేదని ఆరోపించారు. ఆర్డీఎస్ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.
ఆంధ్రోళ్ల బూట్లు మోసిన వ్యక్తి ఇవాళ నన్ను తిడుతున్నాడు : సీఎం కేసీఆర్
CM KCR Latest Comments on Congress: బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీనేనని.. మరోసారి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని కేసీఆర్భరోసా ఇచ్చారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్ గతంలో పెండింగ్‌లో పెట్టింది కూడా కాంగ్రెస్‌నేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలను సరిదిద్దుకొస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉండే పింఛన్‌ను రూ.2వేలకు పెంచామని హర్షం వ్యక్తం చేశారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు.
"వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందా? కాంగ్రెస్ వస్తే దళారుల, పైరవీకారుల రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ వస్తే పదేళ్లు మేము చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలి. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ అవసరం లేదని రేవంత్ అన్నారు. రైతుబంధు, 24 గంటల కరెంట్ కావాలో.. వద్దో ఆలోచించాలి."- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి