CM KCR Jogulamba Gadwal Tour :జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ది కోసం ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు.. ప్రతి మండల కేంద్రానికి రూ.15 లక్షలు.. గద్వాల పురపాలికకు రూ.50 కోట్లు.. మిగిలిన మూడు పురపాలికలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన జోగులాంబ గద్వాల జిల్లా ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
శంకుస్థాపనలకే పరిమితం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు.. కోయిల్‌సాగర్, బీమా ఎత్తిపోతల పథకాలన్నింటిని పూర్తి చేసుకున్నామని కేసీఆరే పేర్కొన్నారు. తద్వారా 15లక్షల నుంచి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. గతంలో మంత్రులుగా ఉన్నవారు.. ఏ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని విమర్శించారు. వారు కేవలం శంకుస్థాపనలకు పరిమితం అయ్యారని కేసీఆర్ దుయ్యబట్టారు.
ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని అంటున్నారు : తెలంగాణ వచ్చిన తర్వాతే నెట్టెంపాడు, బీమా ద్వారా సాగునీరు అందుతుందని.. గట్టు ఎత్తిపోతలకు పునాదిరాయి వేసుకున్నామని.. ఆ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని కేసీఆర్ వివరించారు. ఆర్డీఎస్ కొనసాగింపుగా ఉన్న మల్లమ్మకుంట జలాశయం పనులను సైతం త్వరలోనే పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. మూడు సంవత్సరాలు కష్టపడి ధరణిని తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు బంగాళాఖాతంలో వేస్తారని అంటున్నారని కేసీఆర్ విమర్శించారు.
KCR on Dharani Portal :ధరణిని బంగాళాఖాతంలో కలపితే.. రైతులను బంగాళాఖాతంలో కలిపినట్లేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీని వల్లె రైతుబంధు, ధాన్యానికి డబ్బులు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. ధరణి ఉండాలా వద్దా.. మీరే చెప్పాలని ప్రశ్నించారు. కానీఎక్కడికి వెళ్లిన ధరణి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ప్రతిపక్షాలు మాత్రం ఎత్తేస్తామంటున్నారని విమర్శించారు.ధరణి వద్దనే వాళ్లకు ప్రజలే జవాబు చెప్పాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు గద్వాల కలెక్టరేట్లోని సమీకృత అధికారుల కార్యాలయ భవనంలో ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉందని వివరించారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం.. ఓడీఎఫ్ ప్లస్, త్రాగునీరు అందించడంలో రాష్ట్రం ముందుందన్నారు. ఈ క్రమంలోనే బాగుపడ్డామని చెప్పి విశ్రాంతి తీసుకుంటే.. దెబ్బతినే ప్రమాదం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.