కర్ణాటక నుంచి పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బిరబిరా వస్తోంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టికి 70 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 36 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో మరో నాలుగు టీఎంసీలు నిండితే నారాయణపూర్ జలాశయం కూడా పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకోనుంది. ఈ జలాశయానికి ఎగువ నుంచి 40 వేల క్యూసెక్కులు వస్తుండటంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఆదివారం ఎత్తారు. సుమారు 28,480 క్యూసెక్కుల ప్రవాహాన్ని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి జోగులాంబ గద్వాల జిల్లా పారేవుల సమీపంలో.. ఎగువ నుంచి వస్తున్న వరద జూరాల వెనుక జలాలను తాకే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
వరద పెరిగితే వారం రోజుల్లో శ్రీశైలానికి..
జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులకు గాను ఆదివారం నాటికి 1,042.29 అడుగుల వద్ద నీళ్లు ఉన్నాయి. మరో మూడు అడుగులు చేరితే తొలుత విద్యుదుత్పత్తి ప్రారంభించి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నదికి రోజుకు 4 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద కూడా తోడైతే జూరాలను దాటి వారం రోజుల్లో శ్రీశైలాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర నదికి కూడా వరద క్రమంగా పెరుగుతుండటంతో ఈ ఏడాది శ్రీశైలానికి ముందుగానే వరద పోటెత్తుతుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీని దాటి మూడు వేల క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తోంది.