Virtual Teaching: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రవిశంకర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠ్యాంశాలకు శాస్త్ర సాంకేతికతను జోడించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వర్చువల్ రియాలిటీ, ఆగ్యూమెంటెడ్ రియాలిటీలతో సైన్స్ పాఠాలు బోధిస్తున్నారు. వర్చువల్ రియాలిటీలో హెడ్ సెట్‌ను ఉపయోగించి జీవశాస్త్రానికి సంబంధించిన వీఆర్ వీడియోలను చూపిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గత ఏడాది నుంచి ట్యూటర్ యాప్‌ను వినియోగిస్తూ ఈ సాంకేతికతో డిజిటర్ తెర ద్వారా పాఠాలు చెబుతున్నారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు: అయితే బోధనలో కొత్తదనాన్ని చాటుకోవడం, వినూత్న పద్దతులు అనుసరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం రవిశంకర్‌కు కొత్తేమీ కాదు. 2019 నుంచి ఆయన బోధనలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2020లో జీవశాస్త్ర వర్ణమాలను రూపొందించారు. 2021లో జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్‌ను తయారు చేశారు. ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్‌ను రూపొందిస్తున్నారు.
మెచ్చుకున్న విద్యాశాఖ మంత్రి: 2022లో పదో తరగతి జీవశాస్త్ర పాఠ్యాంశాల ఆధారంగా వైకుంఠపాళిని తయారుచేశారు. విద్యారంగంలో ఇతను చేస్తున్న సేవలను తెలుసుకుని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో రవిశంకర్ చెబుతున్న పాఠాలు తమకు సులభంగా అర్థమవుతున్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.