కొవిడ్ నిబంధనలను అనుసరించి నిరాడంబరంగా జరుపుకోనున్న తుంగభద్ర పుష్కరాలకు కనీస వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పుష్కరాలు నిర్వహించనున్న 4 ఘాట్లు అలంపూర్, వేణి సొంపురం, పుల్లూరు, రాజోళి పుష్కరఘాట్ల వద్ద మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు.
తుంగభద్ర పుష్కర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష - tungabhadra pushkaralu
తుంగభద్ర పుష్కర ఏర్పాట్లపై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులతో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓఝా సమీక్ష నిర్వహించారు. పుష్కరఘాట్ల వద్ద మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు.

కరోనా నేపథ్యంలో పుష్కరాలకు తక్కువ మంది భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే వి.యం.అబ్రహం ఆదేశించారు. వచ్చే వారందరికి ప్రాథమిక కొవిడ్ పరీక్షలు చేయాలన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో వి.రాములు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'బాగా చదివి కలెక్టరమ్మవు కావాలి... మన జిల్లాకే రావాలి'