కంటైన్మెంట్ ఏరియా నుండి ఎవరు బయటికి రాకుండా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా అధికారులను ఆదేశించారు. ఇంఛార్జి ఎస్పీ అపూర్వ రావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్షతో పాటు ఇతర జిల్లా అధికారులతో కలిసి గద్వాలలోని కంటైన్మెంట్ ప్రాంతాలను పర్యవేక్షించారు.
'కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలి' - LOCK DOWN EFFECTS
జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా అధికారులతో కలిసి గద్వాలలో పర్యటించారు. పట్టణంలోని కంటైన్మెంట్ ప్రాంతాలను పర్యవేక్షించారు. కంటైన్మెంట్ ఏరియాల నుంచి ఏ ఒక్కరూ బయటికి రాకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
మొమిన్ మోహల్లా, గంజిపేట, వేదనగర్ ఏరియలో పర్యటించిన కలెక్టర్... కంటైన్మెంట్ ఏరియాకు అన్ని దిక్కుల బారికేడ్లు ఏర్పాటు చేసి ఒకే ఒక్కచోట దారిని ఏర్పాటు చేయాలన్నారు. ఏరియా నుంచి ఏ ఒక్కరు బయటికి రాకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ ఏరియాలో నిత్యావసర సరుకులు, పాలు, మెడిసిన్ వంటివి కేవలం వాలంటీర్ల ద్వారానే అందించాలన్నారు.
జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కొత్త ఏరియాల్లో వ్యాధి సోకితే మరిన్ని సమస్యలు ఏర్పడుతాయన్నారు. కరోనా అనుమానం ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.