తెలంగాణ

telangana

ETV Bharat / state

Gurramgadda: ఏరు మధ్యలో ఊరు... బతుకు గడవాలంటే నది దాటాల్సిందే! - Gurrangadda villagers struggles news

ఒక ఊరు నుంచి మరో ఊరెళ్లాలంటే రహదారులుండాలి. గతుకులు రోడ్లుంటేనే అడుగు ముందుకు పడదు. అలాంటిది అక్కడ ఊరు దాటాలంటే ముందు ఏరు దాటాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీరం చేరితే కానీ బతుకు గడవదు. వానాకాలం వచ్చినా... నది ఉప్పొంగినా... బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోతాయి. పాలకుల కరుణకు నోచుకోక... వారధి నిర్మాణం జరగక.... దశాబ్దాలుగా కష్టాల కడలిని ఈదుతోంది.... జోగులాంబ గద్వాల జిల్లాలోని గుర్రంగడ్డ దీవి.

Gurrangadda
గుర్రంగడ్డ

By

Published : Jul 29, 2021, 6:19 AM IST

బతుకు గడవాలంటే నది దాటాల్సిందే!

చుట్టూ ఏరు... మధ్యలో ఊరు. బతుకు గడవాలంటే ముందు వారు నది దాటాలి. అందుకోసం నిత్యం సాహసకృత్యాలు చేయాలి. వారధి నిర్మిస్తామని దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్నా హమీలు... ఎప్పుడూ ఎండమావులనే తలపిస్తున్నాయి తప్ప... అడుగు ముందుకు పడటంలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ (Gurramgadda) దీవి ప్రజల కష్టాలివి. 900 మంది జనాభా ఉండే ఈ గ్రామం 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో వెయ్యి 50ఎకరాల్లో నీటి ఆధారిత పంటలు... 350 ఎకరాల్లో వర్షాధార పంటలు సాగుచేస్తున్నారు. నది మధ్యలో ఉన్న ఈ గ్రామానికి బయటి ప్రాంతాలతో సంబంధాలు లేవు. దీంతో ఏ చిన్న పనికోసం ఇతర చోట్లకు వెళ్లాలన్నా... ముందుగా నదిని దాటాలి. ప్రాణాలను అరచేతి పెట్టుకొని మరబోటు, పుట్టిలలో ప్రయాణం చేస్తూ... దీనస్థితిలో జీవనం సాగిస్తున్నారు.

హామీలకే పరిమితం...

ఇక... వర్షాకాలంలో, నది ఉప్పొంగిన సమయంలో బయటికి వెళ్లటం సంకటంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గత కొన్ని రోజులుగా కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల వరుసగా వర్షాలు... ఉప్పొంగుతున్న నదితో అవస్థలు పడుతూ అష్టకష్టాలు పడుతూ, గద్వాలకు రావాల్సి వస్తుందని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. గర్రంగడ్డ గ్రామస్థుల వెతలు తీర్చేందుకు 2009లో ఇనుప తాళ్ల వంతెనను ప్రభుత్వం మంజూరు చేసింది. కొన్నాళ్లకు ఆ ప్రతిపాదన రద్దు చేసి సిమెంట్‌ కాంక్రీట్‌ వంతెనకు రూపకల్పన చేసినా... అదీ కార్యరూపం దాల్చలేదు. 2018 ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 6 నెలల్లో గుర్రంగడ్డ వంతెన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. 2019లో శంకుస్థాపన కూడా చేసినా... పనులు మాత్రం ముందుకు సాగటంలేదని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇప్పటికైనా...

పాలకుల హామీలు నీటిమూటలుగానే మారటంతో... గ్రామస్థులంతా ఏకమై, ప్రత్యామ్నాయ మార్గాల కోసం నడుంబిగించారు. వేసవిలో తూర్పువైపు నది ప్రవాహం తగ్గగానే తాత్కాలికంగా మట్టిని పైపులు వేసి... అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నదికి వరద రాగానే మళ్లీ యథాస్థితి నెలకొంటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి వంతెన నిర్మాణం పూర్తిచేయాలని గుర్రంగడ్డవాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్​కు మొదలైన పర్యాటకుల తాకిడి..!

ABOUT THE AUTHOR

...view details