తెలంగాణ

telangana

ETV Bharat / state

యాసంగిలో 3 లక్షల ఎకరాలకు నీరివ్వటమే లక్ష్యం - minister niranjan reddy latest news

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల కింద సుమారు 3లక్షల ఎకరాలకు యాసంగి పంటకు సాగునీరు అందించాలని సాగునీటి సలహా బోర్డు నిర్ణయించింది. కేవలం ఆరుతడి పంటలకు వారాబంది విధానంలో ఈ రబీలో రైతులకు సాగునీరు అందనుంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీటి సరఫరాకే మొదటి ప్రాధాన్యం ఇచ్చిన బోర్డు తాగునీటి కేటాయింపులు పోను మిగిలిన నీటిని పొదుపుగా వాడుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

goverment aim is to irrigate 3 lakh acres in Yasangi
యాసంగిలో 3 లక్షల ఎకరాలకు నీరివ్వటమే లక్ష్యం

By

Published : Dec 13, 2019, 11:47 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల కింద 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సాగునీటి సలహా మండలి నిర్ణయించింది. గద్వాలలోని హరిత హోటల్​లో మంత్రి నిరంజన్​రెడ్డి, శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అబ్రహం, జిల్లా పరిషత్ ఛైర్మన్లు సరిత, స్వర్ణ సుధాకర్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక, వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సహా నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

జూరాల ప్రాజెక్టు కింద..
జూరాల ప్రాజెక్టు కింద గత ఖరీఫ్​లోని కుడి, ఎడమ కాల్వల కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందించగా రబీలో ఎడమ కాల్వ కింద 20వేల ఎకరాలకు, కుడి కాల్వ కింద 10వేల ఎకరాలకు కేవలం ఆరుతడి పంటలకు వారాబందీ విధానంలో సాగునీరు అందించనున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. 2.66 టీఎంసీలు మిషన్ భగీరథకు కేటాయించారు. మిగిలిన ఆరు టీఎంసీల్లోనే రబీకి నీరు అందించనున్నారు.

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ లేనప్పుడు ఆయకట్టుకు నీరందించే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా.. ఇతర పథకాలకు నీళ్లు పంపింగ్ చేయడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

20వేల ఎకరాలకు..

రాజోలి బండ డైవర్షన్ స్కీంలో భాగంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద ఖరీఫ్​లో 40వేల ఎకరాలు సాగునీరు అందగా.. రబీలో కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే ఆరుతడి పంటలకు నీరు అందించనున్నారు. మార్చి 15 వరకు ఐదారు తడుల్లో వారాబందీ పద్ధతిన నీరు అందిస్తారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద గత ఖరీఫ్​లో 90వేల ఎకరాలకు సాగునీరు అందించారు.

భీమా, కోయిల్​ సాగర్..

భీమా కింద 21వేల ఎకరాలు, కోయల్ సాగర్ కింద 6వేల ఎకరాలకు నీరిస్తారు. శ్రీశైలం జలాశయంలో నీళ్లు పుష్కలంగా ఉన్నందున మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద లక్షా 86వేల ఎకరాలకు ఈ రబీలో సాగునీరు అందించేందుకు నిర్ణయించారు. కోయిల్ సాగర్ మోటర్ల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ప్రాజెక్ట్ నింపడానికి ఎక్కువ సమయం పడుతోందని వరద అధికంగా ఉన్న సమయంలో కోయిల్ సాగర్ నింపడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సాగునీటిని సద్వినియోగం చేసుకోండి..

ఉన్న సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. గత పాలకులు జలాశయాలు నిర్మించకపోవడం వల్లే ప్రస్తుతం ఎంతనీరొచ్చినా నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

రైతుల ఆగ్రహం..
సాగునీటి సమస్యలను బోర్డు దృష్టికి తీసుకువెళ్లేందుకు అక్కడకు వచ్చిన రైతులను లోపలికి అనుమతించకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్టెంపాడు, జూరాల కుడి కాల్వకు సంబంధించిన రైతులు సమస్యలను వివరించే అవకాశం ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

నీరివ్వటమే లక్ష్యం

ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే

ABOUT THE AUTHOR

...view details