పాలమూరు జిల్లాలోని అతిపెద్ద సంస్థానం గద్వాలలో శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి కొలువై ఉన్నారు. కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేర్చే చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 17వ శతాబ్దంలో సోమనాథ భూపాలుడు నిర్మించారు. శ్రీ చెన్నకేశవ స్వామి... వీరత్వానికి, శౌర్యానికి, విజయానికి మారుపేరు. అందుకే రాజులు, యుద్ధ వీరులు ఎక్కువగా స్వామివారిని కొలిచేవారు.
శత్రు రాజ్యాలు చెన్నకేశవ స్వామి ఆలయాన్ని తాక కూడదని భూపాలుడు కోట చుట్టూ ఒక కందకం తవ్వించారు. ఆ కందకంలో మొసళ్ళు పెంచే వారని ఇక్కడివారు చెబుతారు. మూడు వందల సంవత్సరాల క్రితమే మట్టితో నిర్మించిన ఈ కోట గోడలు ఇప్పుడు మనకు శిథిలావస్థలో కనబడుతున్నాయి.
కుడి ఎడమైంది :
సాధారణంగా విష్ణుమూర్తికి కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, మరో చేతిలో గద ఉంటుంది. కానీ ఈ ఆలయంలో కొలువైన చెన్నకేశవ స్వామికి కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం, మరో చేతిలో గద దర్శనమిస్తోంది. ఇదే ఈ ఆలయాన్ని ప్రపంచంలోని విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేకంగా నిలబెడుతోంది.