జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నిర్మాణం చేసి 1990లో జూరాల ప్రాజెక్టుకు క్రస్టు గేట్లను ఏర్పాటు చేశారు. 1996లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా నేటి వరకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతో త్వరలోనే క్రస్టు గేట్ల మరమ్మతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తుప్పు పట్టే పరిస్థితి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 62 క్రస్టు గేట్లు, ఆరు విద్యుదుత్పత్తి గేట్లతో నిర్మాణమైంది. పాలకులు ప్రాజెక్టు నిర్వహణ విషయంలో నిరాధరణతో గేట్లకు తుప్పు పట్టే పరిస్థితి వచ్చింది. నాలుగేళ్లకు ఓసారి మార్చాల్సిన రబ్బర్ సీలను మార్చకపోవడంతో 18 గేట్ల నుంచి నీటి లీకేజీలు వస్తున్నాయి. గేట్లను మరమ్మత్తులు చేయడం, గేట్లను ఎత్తడానికి అవసరమైన హాయిస్ట్ మోటార్ల నిర్వహణ, తుప్పు ఏర్పకుండా ఇసుకతో క్లీనింగ్ చేయించి రంగులు వేయడం, గేట్లను ఎత్తాల్సిన ఇనుప తాళ్లకు గ్రీజింగ్ చేయడం, రబ్బర్ సీల్స్ వేయడం వంటి వాటిని ప్రతి ఏటా వేసవిలో పరిశీలన చేసుకోవాల్సింది. కానీ ప్రభుత్వం నుంచి మెకానికల్ విభాగానికి నిధులు విడుదల కాకపోవడంతో పట్టించుకోలేదు.
నిధులు లేక..
నిధులు విడుదల కాకపోవడం జూరాల ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు శాపంగా మారింది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాజెక్టు సమస్యలపై సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు ఇవ్వకపోవడం కూడా ఒక కారణమే. ఆరేళ్ల నుంచి గేట్లకు సంబంధించిన రబ్బర్ సీలను మార్పు చేయకపోవడంతో ఏడు క్రస్టు గేట్ల నుంచి లీకేజీ ఎక్కువగా ఉండగా, మరో 11 గేట్లనుంచి లీకేజీ కొనసాగుతోంది.